
కరోనా మహమ్మారిపై ముందస్తుగా అప్రమత్తత, ప్రపంచదేశాలను జాగృతం చేయాల్సిన విషయంలో ఫెయిలయిందంటూ ఇప్పటికే అనేక విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా మరో వివాదానికి తెరలేపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) షేర్ చేసిన ఇండియా మ్యాప్ వివాదాస్పదమవుతోంది. ఏకంగా ఈ మ్యాప్‌లో వక్రీకరించడం ద్వారా మరో భారీ వివాదాన్ని రేపుతోంది.
డబ్ల్యూహెచ్‌వో తన వెబ్సైట్లో ప్రచురించిన మ్యాప్‌లో జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను భారత్ నుంచి వేరుగా చూపిస్తూ.. వేరు వేరు రంగుల్లో ప్రచురించింది. కొత్తగా ఏర్పడిన ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు బుడిద రంగులో ఉన్నాయి. మిగతా ఇండియా మ్యాప్ నేవీ బ్లూ రంగులో కనిపిస్తోంది. మరో వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన అక్సాయ్ చిన్ను నీలి చారలతో బూడిద రంగులో చైనాలో భాగంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపించిందో చూపెట్టడానికి డబ్ల్యూహెచ్‌వో ఈ మ్యాప్‌లో చూపించింది. అయితే ఇది పొరపాటు కాదని, డబ్ల్యూహెచ్‌వో చేసిన ఈ పని వెనుక చైనా ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మ్యాప్‌ను డబ్ల్యూహెచ్‌వో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. లండన్‌లో ఉండే పంకజ్ అనే ఓ ఇండియన్ దీనిని గుర్తించాడు. ఈ మ్యాప్ తన వాట్సాప్ గ్రూప్‌లో వచ్చినట్లు అతను చెప్పాడు. ఆ వెంటనే ఈ మ్యాప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఇండియన్ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాము ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాల ప్రకారమే ఈ మ్యాప్ విడుదల చేసినట్లు వివరణ ఇచ్చింది.