దీపావళి రోజున శ్రీలక్ష్మీ పూజ జరుపుకోవడం వెనుక కారణం ఏమిటి?

sri mahalakshmi

నేడు తెలుగు లోగిళ్లలో దీపావళి పండుగ సందడి చేయబోతుంది.. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.. దీపావళి పండుగ గురించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.. లంకలో రావణుని సంహరించి, రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని ప్రతీతి.. ఈ దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీని పూజించడం సంప్రదాయం.. ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. అసలు దీపావళి పండుగ నాడు లక్ష్మీ పూజ చేయడం అనే ఆనవాయితీ ఎందుకు వచ్చిందో చూద్దాం.

దీపాలపండుగ అయిన దీపావళిరోజున ప్రతి ఒక్కరూ శ్రీ మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. దీంతో ఆగ్రహించిన దుర్వాసనుడు  దేవేంద్రుని శపిస్తాడు. ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

 ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.కావున ప్రతి ఒక్కరూ ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి. దీపాలు వెలిగించి కరోనా రాకాసిని తరిమికొట్టాలని శ్రీ లక్ష్మీ అవ్మవారిని ప్రార్థించండి...ఆ తల్లి చల్లని చూపుతో అష్టైశ్వర్యాలు సిద్ధించి కలకాలం సుఖ సంతోషాలతో వర్థిల్లండి.