ఆ.. కేసులో ఒబెరాయ్ బావమరిది అరెస్ట్..

ఆ.. కేసులో ఒబెరాయ్ బావమరిది అరెస్ట్..

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌కి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. శాండల్‌వుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య ఆళ్వాను నిందితుడుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు. అతడు పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపులో భాగంగా గురువారం ముంబయిలోని వివేక్ ఒబెరాయ్ నివాసంలో సోదాలు చేశారు. బెంగళూరులోని కాటన్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్లో ఆదిత్యపై కేసు నమోదు చేశారు. నేడు అత‌ని ఆచూకీ తెలియ‌డంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 

సెప్టెంబర్ నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆదిత్యను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆదిత్య బెంగళూరు నుంచి చెన్నైకి మకాం మార్చాడని, చెన్నై నుంచి పలు ప్రాంతాలకు ఆదిత్య వెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో అత‌ని స‌న్నిహితుల ఇండ్ల‌లో సోదాలు నిర్వహించారు.
 
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారందరితోనూ ఆదిత్య ఆళ్వాకు సంబంధాలు ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఆదిత్య ఆళ్వాకు చెందిన ‘హౌస్ ఆఫ్ లైఫ్’ రిసార్ట్‌లో పలు పార్టీలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆదిత్య ఆళ్వాపై అప్పట్లోనే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆదిత్య దేశంలోనే ఉన్నట్లుగా భావించిన పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు సాగించారు. ఎట్టకేలకు చెన్నైలో ఆదిత్య ఆళ్వాను అదుపులోకి తీసుకున్నారు.