
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెడ్ఎఫ్సీకి భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ గట్టి ఝలక్ ఇచ్చింది. హెచ్డీఎఫ్సీ అందిస్తున్న ఆన్లైన్ సేవల్లో పలుమార్లు అంతరాయాలు ఏర్పడడంతో ఆగ్రహించిన ఆర్బీఐ వెంటనే కొత్త క్రెడిట్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు కొత్తగా డిజిటల్ సేవలేవి ప్రారంభించవద్దని హెచ్‌డీఎఫ్‌సీకి తేల్చి చెప్పింది. అదే సమయంలో ఐటీ వ్యవస్థలోని లోటుపాట్లును వెంటనే తొలగించుకోవాలని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యాజమాన్యానికి ఆర్బీఐ సూచించింది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకే అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తొందన్న విషయం తెలిసిందే. కాగా.. ఆర్బీఐ ఆదేశాల గురించి హెచ్డీఎఫ్సీ యాజమాన్యం స్పందించింది. ఈ ఆదేశాల వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలకు ఎటువంటి అంతరాయం కలగదని తెలిపింది. తమ ఐటీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పుకొచ్చింది.
గత రెండేళ్లుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆన్లైన్ సేవల్లో పలు మార్లు అంతరాయం ఏర్పడుతుండటంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఇటీవల బ్యాంకు డాటా సెంటర్లలో తలెత్తిన ఓ సమస్య కారణంగా.. ఏకంగా 12 గంటల పాటు ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులతో పాటూ..ఏటీఎంలు కూడా పనిచేయలేదు. దీంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది డేటా నెట్వర్క్ ప్రాబ్లమా...ఏదైనా హ్యాకింగ్ ప్రాబ్లమా అన్న కస్టమర్ల ప్రశ్నలకు హెచ్డీఎఫ్సీ యాజమాన్యం సరైన సమాధనం ఇవ్వలేదు. గత రెండేళ్లుగా బ్యాంకు ఆన్లైన్ సేవల్లో తరుచుగా సమస్యలు ఏర్పడుతుండడంతో సీరియస్ అయిన ఆర్బీఐ..వెంటనే క్రెడిట్ కార్డులను జారీ చేయడం ఆపేయాలని, ఐటీ సమస్యలు తొలిగేవరకు కొత్తగా డిజిటల్ సేవలేవి ప్రారంభించవద్దని హెచ్‌డీఎఫ్‌సీకి ఆర్డరేసింది. మొత్తంగా హెచ్‌డీఎఫ్‌సీకి ఆర్బీఐ ఇచ్చిన ఝలక్ బ్యాంకింగ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.