బిగ్ ‌'బీ' కి ఎదురుదెబ్బ‌..! 

బిగ్‌బీకి ఎదురుదెబ్బ‌..! 

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్, బిగ్ బీ‌ అమితాబ్‌ బచ్చన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అద్భుతమైన నటనకు తోడు, ఆయన గొంతుకు కూడా చాలా క్రేజ్ ఉంది.  అలనాటి ‘దో బూంద్‌ జిందగీ కే లియే’ అనే పోలీయో వ్యాక్సిన్‌ యాడ్‌ నుంచి, ఈనాటి కరోనా వైరస్‌ కాలర్‌ ట్యూన్‌ వరకూ ఆయన వాయిస్‌ విన్నవారెవ్వరైనా  బిగ్‌బీకి ఫిదా అవ్వకు మానరు. ఈ వాయిసే ఆయ‌ను ఇర‌కాటంలో ప‌డేసింది.  కరోనా కాలర్‌ట్యూన్‌ వాయిస్‌కు బిగ్‌బీ అనర్హుడంటూ .. అయితే ఈ కాలర్ ట్యూన్‌లో అమితాబ్ రికార్డింగ్‌ను తొలగించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు.  ప్ర‌స్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. 

 జాగ్రత్తలు చెప్పుతున్న‌ అమితాబ్ బ‌చ్చ‌నే కరోనా బారిన పడ్డారని, ఇక ఆయన ఎలా సలహా ఇస్తారని పిటిషనర్‌ వాదించారు. ఆయనే సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు కదా ఆరోపించారు. అంతేకాదు  రెమ్యూనరేషన్‌ తీసుకొని వాయిస్‌ చెప్పడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఎంతో మంది కరోనా యోధులతోపాటు, సినిమా ప్రముఖులు సమాజ సేవలో పాల్గొన్నారని, పేదలకు భోజనం పెట్టడంతో పాటు వసతి, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దేశ సేవ చేసిన వాళ్లలో చాలామంది ఈ కాలర్ ట్యూన్‌కు ఉచితంగా వాయిస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అమితాబ్ మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా పారితోషికం తీసుకున్నారని  పేర్కొన్నారు. 

అమితాబ్ సామాజిక కార్యకర్త కాదని..అతను డబ్బే పరమావధిగా పనిచేస్తాడని, కరోనా లాక్‌డౌన్ టైంలో అసలు అతను ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు అమితాబ్ ఫ్యామిలీ కరోనా బారిన పడినట్లు కోర్టుకు వివరించారు. అంతేకాదు అతనికి కరోనా కాలర్ ట్యూన్‌కు కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని.. అందువల్ల అతని వాయిస్ ను ఆ ట్యూన్ నుంచి తొలగించాలని వారు కోరారు. ఈ సేవను ఉచితంగా అందించేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.