గూగుల్ మ్యాప్స్ న‌మ్ముకుని.. మృత్యుఒడిలోకి..

గూగుల్ మ్యాప్స్ న‌మ్ముకుని.. మృత్యుఒడిలోకి..

 ఒకప్పుడు కొత్త ప్రాంతానికి వెళ్లే.. ఎవ‌రినైనా అడిగి తెలుసుకునే వాళ్లం.  కానీ ఇప్పుడు మాత్రం గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం. కొత్త ప్రదేశానికి వేళ్లాలనుకునేవారి మార్గదర్శి. చేరాల్సిన గమ్యస్థానం గురించి నొక్కి.. గూగుల్ మ్యాప్స్ ను చూసుకుంటూ వెళ్ళిపోవడమే.  అలాగే.. గూగుల్ మ్యాప్స్‌‌ చూపించే దారిలోనే ప్రయాణిస్తూ ఓ వ్యక్తి అనూహ్యంగా మృత్యు ఒడికి చేరుకున్నాడు. ఇక గూగుల్ మ్యాప్స్ ను నమ్మి ప్రయాణం సాగించగా ఓ కారు ఏకంగా డ్యామ్‌లోనే పడిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..  పుణెకు చెందిన గురు శేఖర్ (42) మిత్రులతో కలిసి ఫార్చ్యూనర్‌ కారులో ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకున్నారు. సతీశ్ గులే అనే వ్యక్తి గురుశేఖర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  కాగా.. ఆదివారం నాడు వీరిరువురూ మరో వ్యక్తితో కలిసి ట్రెక్కింగ్ కోసమని కల్సూబాయ్ కొండవైపు వెళ్లారు. రాత్రి 1.30 గంటల సమయంలో చీకటి కారణంగా దారితప్పిపోయారు. దీంతో వారు గూగుల్ మాప్స్ సాయం తీసుకున్నారు. వారు వెళ్లే మార్గంలో ఓ బ్రిడ్జ్ ఉన్నట్టు మ్యాప్స్‌లో కనిపించింది. అది రాంగ్‌ రూట్ చూపించిందని తెలియని ఈ బృందం గూగుల్‌ మ్యాప్‌ను ఫాలో అవుతూ పోయారు.

చీకటిపడినా గూగుల్‌ మ్యాప్‌ చూపిస్తుందన్న ధైర్యంతో ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. ఒక డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. చీకట్లో అక్కడ బ్రిడ్జి ఉందనుకుని కారును పోనివ్వగా అది కాస్తా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్రమత్తమైన శేఖర్, సమీర్, మరో వ్యక్తి కారు డోర్లను తీసుకుని ఈదుతూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు. సతీష్‌కు ఈత రాకపోవడంతో బయటకురాలేక పోయాడు. కారులోనే ప్రాణాలు కోల్పోయాడు.  సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును గుర్తించి మృత‌దేహాన్ని వెలికి తీశారు.   ఈ ఘటన గురించి తెలుసుకుని చాలా మంది గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మకూడదని అంటున్నారు.