ఆ ఘ‌ట‌న‌పై ఐసీసీ సిరీయ‌స్ ! వెంట‌నే చర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశం..‌‌

ఆ ఘ‌ట‌న‌పై ఐసీసీ సిరీయ‌స్ ! వెంట‌నే చర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశం..‌‌

సిడ్ని వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్-భారత్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ప్రేక్షకుల్లోంచి కొందరు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నిన్న టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇవాళ కూడా సిరాజ్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యంపోసినట్టయింది. ఈ దుశ్చ‌ర్య‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు(ఐసీసీ) ఆస్ట్రేలియాను వివరణ కోరింది. క్రీడాకారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆసిస్ క్రీడాభిమానుల పట్ల ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోరింది. ఈ విషయాన్ని టీమిండియా ప్లేయర్లు కెప్టెన్‌ రహానేకు ఫిర్యాదు చేయగా.. రహానే అంపైర్ల దృష్టికి తీసుకెళ్లారు. అంపైర్లు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని బయటకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.  

అలాగే, ఈ ఘ‌ట‌న‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. జాతివివక్ష దూషణలు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు. గతంలోనూ బౌండరీ లైన్ల వద్ద ఇలాంటివి ఎన్నో నీచమైన ఉదంతాలు జరిగాయని ఇప్పుడు జరిగిన ఘటనలు రౌడీ తరహా ప్రవర్తనకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ చేస్తుండగా జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం అని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ ఘ‌ట‌న‌ను చాలా తీవ్రంగా తీసుకో వాల‌ని, దీనిపై వెంట‌నే విచారణ వెంట‌నే డిమాండ్ చేశాడు. మరోసారి ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠినశిక్షలు విధించాలని తెలిపాడు.