
జనగామలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీజార్జ్ చేయడంపై కమళం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు నిరసనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చలో జనగామ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లాఠీ ఛార్జ్ చేసిన సిఐ మల్లేష్ పై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డెడ్ లైన్ పెట్టిన బండి సంజయ్, చర్యలు తీసుకోకుంటే డిజిపి కార్యాలయాన్ని సైతం ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ మహిళా నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి జనగామ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కేసీఆర్ దొర పాలనలో అరాచకాలు హద్దు మీరుతున్నాయని విమర్శించారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో కేసీఆర్ దుర్మార్గాలను అంతకు రెట్టింపు స్థాయిలో ప్రతిఘటిస్తారని అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఇదే తీరున వ్యవహరిస్తే.. టీఆర్ ఎస్ నాయకులు కూడా తిరగలేని పరిస్థితులు ఉత్పన్నమవుతాయని అని విజయశాంతి ట్వీట్ చేశారు. అలాగే, ఉద్యమాలకు ముందుండి పోరాడే నాలాంటి కార్యకర్తలు బీజేపీలో అసంఖ్యాకంగా ఉన్నారని , ఆ విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు.