ఆర్టీసీ ఎండీగా మాజీ డీజీపీ..! జ‌గ‌న్ సంచ‌ల‌న ఉత్త‌ర్వులు

ఆర్టీసీ ఎండీగా మాజీ డీజీపీ..! జ‌గ‌న్ సంచ‌ల‌న ఉత్త‌ర్వులు

ఏపీఎస్ ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్, ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను నియమించారు. ఈ మేర‌కు జ‌గ‌న్ స‌ర్కార్ బుధ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న ఆయ‌న‌ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. ఆర్టీసీ ఎండీగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డిని బదిలీ చేసిన ప్రభుత్వం., ఆ తర్వాత ఐఏఎస్ కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆర్పీ ఠాకూర్ ను డీజీపీగా నియమించింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఠాకూర్ నియామకాన్నివ్యతిరేకించడంతో పాటు ఆయన వైఖరిపై బహిరంగంగానే విమర్శలు చేసింది. అనంత‌రం   2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత కొత్త బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

ఆర్పీ ఠాకూరు  ఐఐటీ కాన్పూర్‌ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌‌ చదువుకున్నర్, 1986 డిసెంబర్‌ 15న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో అదనపు ఎస్పీగా ఆయన తొలి బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు, వరంగల్‌ జిల్లాల ఏఎస్పీగా, పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్‌ జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. జోనల్‌ హైదరాబాద్‌ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగానూ పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా, 2016 నవంబర్‌ 19 నుంచి ఏసీబీ డీజీగా నియమితులయ్యారు. అనంతరం డీజీపీగా ప్రమోషన్ పొందారు.